విశ్వం వింతలు..కొన్ని నిజాలు!
జుదగిరి | Updated| February-10- 2016 ..
న్యూట్రాన్ తారలు సెకనుకు 600 సార్లు తిరుగుతాయ్..!
నక్షత్రాలు పేలిపోయిన తర్వాత ఆ పేలుడు కేంద్రంలో ఏర్పడే నక్షత్ర స్థితినే ‘న్యూట్రాన్ నక్షత్రం’గా పిలుస్తారు. ఈ నక్షత్రం జస్ట్ 10 కి.మీ. విస్తీర్ణంలో ఉన్నా కూడా.. మన సూర్యుడి కన్నా అనేక రెట్ల ద్రవ్యరాశితో ఉంటుందట. సాధారణంగా ఇవి సెకనుకు 60 సార్లు తమచుట్టూ తాము గిర్రున తిరుగుతుంటాయి. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో వీటి భౌతిక లక్షణాలు మారిపోయి ఏకంగా సెకనుకు 600 సార్లు కూడా ఇవి తిరుగుతాయట.
రోదసీలో నో సౌండ్!
అంతరిక్షంలో మనం అరిచి కేకలేసినా.. పక్కన ఉన్నవారికి కాదుకదా.. మన శబ్దం మనకే వినిపించదు. ఎందుకంటే యానకం లేనిదే ధ్వనితరంగాలు ప్రయాణించలేవు మరి. రోదసీలో వాతావరణం ఉండదు కాబట్టి.. ధ్వని ప్రయాణానికి అవకాశం లేక అంతా సెలైంట్‌గా ఉంటుందన్నమాట. మరి వ్యోమగాములు ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? రేడియో కమ్యూనికేషన్ ద్వారా. కాంతిలా ధ్వని శూన్యంలో ప్రయాణించలేదు కాబట్టి సరిపోయింది.. లేకపోతే విశ్వం నుంచి నిరంతరం వచ్చే శబ్దాలతో మన చెవులు చిల్లులు పడేవి!
విశ్వంలో చుక్కలెన్ని?
ఈ విశ్వంలో మొత్తం ఎన్ని నక్షత్రాలున్నాయంటే లెక్కించడం దాదాపు అసాధ్యమే. అయితే మన పాలపుంతలోని తారల సంఖ్యతో విశ్వంలోని అన్ని గెలాక్సీల సంఖ్యను గుణిస్తే.. కచ్చితంగా కాకపోయినా.. ఎంతోకొంత అంచనా వేయొచ్చు. ఈ రకంగా చూస్తే.. విశ్వంలో 70 సెక్స్‌ట్రిలియన్‌లు అంటే.. 70,000 మిలియన్ మిలియన్ మిలియన్ల తారలు ఉండవచ్చని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అంచనా. అలాగే విశ్వంలో జిలియన్ల కొద్దీ తారలు ఉండవచ్చని నాసా అంచనా వేసినప్పటికీ.. జిలియన్ అంటే అసంఖ్యాక సంఖ్యగా పేర్కొంటారే గానీ అదిఎంతన్నది ఇంతవరకూ ఎవరూ నిర్ణయించలేదు.
చంద్రుడిపై మనిషి అడుగుజాడలు 10 కోట్ల ఏళ్ల వరకూ చెరిగిపోవు!
చందమామపై మనిషి పాదం మోపినప్పుడు ఏర్పడిన ముద్రలు చెరిగిపోవాలంటే 10 కోట్ల ఏళ్లు పడుతుందట. ముద్రలు చెరిగిపోవాలంటే మట్టి కదలాలి. మట్టి కదలాలంటే గాలి లేదా నీరు కావాలి. చంద్రుడిపై ఇవి రెండూ ఉండవు కాబట్టే.. పాదముద్రలు, రోవర్ చక్రాల జాడలు కోట్ల ఏళ్లపాటు అలాగే ఉండిపోతాయన్నమాట. జాబిల్లిపై నిరంతరం అతిసూక్ష్మస్థాయిలోని ఉల్కారేణువులు కురుస్తూనే ఉన్నా.. అవి పేరుకుపోయి జాడలు చెరిగిపోవడం ఇప్పట్లో జరగదు.
సౌర కుటుంబంలో 99% ద్రవ్యరాశి సూర్యుడిదే!
సౌరకుటుంబం మొత్తం ద్రవ్యరాశిలో 99% ద్రవ్యరాశి ఒక్క సూర్యుడిదేనట. అందుకే కోట్ల కి.మీ. దూరంలోని గ్రహాలను సైతం సూర్యుడు అలా గురుత్వాకర్షణతో చుట్టూ తిప్పుకుంటున్నాడు. సాంకేతికంగా చూస్తే.. సూర్యుడు ‘జీ-టైప్ మెయిన్-సీక్వెన్స్ స్టార్’. ప్రతి సెకనుకూ 60 కోట్ల టన్నుల హైడ్రోజన్‌ను హీలియంగా మార్చేస్తాడన్నమాట. ఇందులో ప్రతిసారీ 40 లక్షల టన్నుల పదార్థం శక్తిరూపంలో విడుదలవుతుంది. అయితే ఇంధనం ఖాళీ కాగానే నక్షత్రాలు నాశనం కాకతప్పదు కాబట్టి.. మన సూర్యుడూ అంత్యదశలో రెడ్ జెయింట్‌గా మారతాడట. అప్పుడు భారీగా పెరిగి ఏకంగా భూమిని సైతం కప్పేస్తాడట. ఇదంతా మరో 500 కోట్ల ఏళ్ల తర్వాతే జరుగుతుంది కాబట్టి.. ఇప్పుడు మనకేమీ భయం లేదు లెండి!
0 comments:
Post a Comment