ఏలియన్స్.. భూమికి వస్తే..
Judagiri | Updated: February 08-2016 :
గ్రహాంతరవాసులు.. మనకెంతో ఆసక్తి కలిగించే సబ్జెక్ట్.. దీనిపై అటు
హాలీవుడ్‌లో ఇటు బాలీవుడ్‌లో సూపర్‌హిట్ సినిమాలు కూడా వచ్చాయి. ఏలియన్స్
కనుక భూమ్మీద అడుగు పెడితే.. మనపై వారిదే పైచేయి అంటున్నారు ప్రముఖ ఖగోళ
శాస్త్రవేత్త, సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్ ఇంటెలిజన్స్(సెటీ) సహ
వ్యవస్థాపకురాలు జిల్ టార్టర్. మనతో పోలిస్తే.. వారి వద్ద ఉండే అత్యాధునిక
సాంకేతిక పరిజ్ఞానమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
ఇక్కడ ప్రతిదాన్ని శాసించే స్థితిలో వారుంటారని ఆమె అంచనా వేస్తున్నారు.
అయితే.. మనం మరీ అంత భయపడాల్సిన అవసరమూ లేదట. ఎందుకంటే.. ఒకవేళ ఏలియన్స్
భూమిని ఆక్రమించినా.. అవి మనతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటాయని జిల్
భావిస్తున్నారు. అయితే.. ఇది తన అంచనా మాత్రమేనని చెబుతున్నారు.
విశ్వంలో ఏలియన్స్ జాడ కనిపెట్టడమే సెటీ సంస్థ(కాలిఫోర్నియా) పని. అయితే..
ఇప్పటివరకూ సరైన ఆధారాన్ని కనుగొనలేకపోవడంపై జిల్ స్పందిస్తూ..
‘విశ్వాన్ని భూమ్మీద ఉన్న సముద్రాలతో పోలిస్తే.. మనం ఇప్పటివరకూ ఓ గ్లాసు
నీళ్లంత భాగాన్ని మాత్రమే పరిశోధించాం’ అని చెప్పారు. గ్రహాంతరవాసులు
ఉన్నట్లయితే.. వారికి మనం ఇక్కడ ఉన్నామన్న విషయం కచ్చితంగా తెలుసని సెటీకి
చెందిన మరో శాస్త్రవేత్త నతాలీ అన్నారు.
‘గ్రహాంతరవాసులు మనల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుండొచ్చు. అయితే..
ఆ సంకేతాలను పట్టుకోవడంలో మనం విఫలమవుతున్నాం’ అని చెప్పారు. అయితే.. తన
జీవితకాలంలో కచ్చితంగా ఏలియన్స్ జాడను కనుగొంటానని నతాలీ నమ్మకంగా
చెబుతున్నారు.
వీరి సంగతిలా ఉంటే.. ఒకవేళ విశ్వంలో గ్రహాంతరవాసులు ఉన్నట్లయితే.. వారిని
కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించడం ద్వారా మనం ఓ ప్రమాదకరమైన ఆటను
ఆడుతున్నామని ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఇప్పటికే
హెచ్చరించారు. ఏలియన్స్ భూమిని కనుగొన్నట్లయితే.. అవి భూమిపై దాడి చేసి,
ఆక్రమించుకుంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.......
0 comments:
Post a Comment