ఫ్యాబ్రిక్‌ కేర్‌: జీన్స్‌ను ఉతికేయండిలా 


ఎంతో కష్టపడి కొనుక్కున్న జీన్స్‌ ఎక్కువకాలం మన్నికగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
  • పదే పదే ఉతకొద్దు. మురికి పట్టనంతకాలం జీన్స్‌ని ఉతక్కుండానే వేసుకోవచ్చు. ఐదారుజతల జీన్స్‌ ఉంటే రొటేషన్‌లో వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రోజుకో జీన్స్‌ వేసుకోవచ్చు. దీని వల్ల అవి ఎక్కువ రోజులు శుభ్రంగా ఉంటాయి కూడా.
  • జీన్స్‌ మీద మచ్చలు, మరకలు పడినప్పుడు జీన్స్‌ మొత్తం ఉతకాల్సిన అవసరంలేదు. మరక పడిన ప్రాంతంలోనే శుభ్రం చేయాలి. లిక్విడ్‌ డిటర్జెంట్‌ని మరక మీద వేసి కొన్ని నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత అంతమేరకు స్క్రబ్‌ చేసి నీళ్లలో జాడించాలి.
  • కొన్ని జీన్స్‌కు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలనే గార్మెంట్‌ ట్యాగ్‌ ఉంటుంది. డెనిమ్‌ జీన్స్‌ అయితే డ్రైక్లీనింగ్‌ చేయమని ఉంటుంది. అందుకని జీన్స్‌ ఉతికేటప్పుడు దానికున్న వాష్‌కేర్‌ ట్యాగ్‌ చదవాలి. ఒకవేళ దానిమీద ఉతకడానికి సంబంధించి ప్రత్యేక సూచనలు ఉంటే వాటినే అనుసరించాలి.
  • మీకెంతో నచ్చిన జీన్స్‌ ఎక్కువకాలం ఉండాలంటే చేతితో ఉతకాల్సిందే. వెడల్పాటి టబ్‌లో జీన్స్‌ మునిగే అన్ని గోరువెచ్చని నీళ్లు నింపి అందులో ఒక క్యాప్‌ లిక్విడ్‌ డిటర్జెంట్‌ వేయాలి. ఆ నీళ్లలో జీన్స్‌ను సమంగా పరిచి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత ఆ నీళ్లలోనే నుసిమి శుభ్రమైన నీళ్లలో పిండి ఆరేయాలి.
  • మిగతా బట్టలతో కలిసి జీన్స్‌ ఉతుకుతుంటారు. కాని అలా చేయకూడదు. వేరే బట్టలతో కలిపి ఉతకడం వల్ల జీన్స్‌ ఫ్యాబ్రిక్‌ మీద అనవసరమైన రాపిడి కలుగుతుంది. అందుకుని జీన్స్‌ను జీన్స్‌తో కలిపే ఉతకాలి. ఒకవేళ వాషింగ్‌ మెషిన్‌లో వేస్తుంటే కనుక ఎక్కువ లోడ్‌ వేయొద్దు. ఒకో లోడ్‌కి నాలుగు జీన్స్‌ మాత్రమే వేయాలి. కలర్‌, ప్లెయిన్‌ జీన్స్‌ను కలిపి ఉతకొద్దు. నలుపు రంగు జీన్స్‌, క్రీమ్‌, వైట్‌ వంటి రంగుల జీన్స్‌తో ఉతకొద్దు. వేటికవి విడివిడిగా ఉతకాలి.
  • ఉతికేముందు జీన్స్‌ని తిరగల తీయాలి. దీనివల్ల బయటి వైపు ఫ్యాబ్రిక్‌ రంగు మారకుండా ఉంటుంది.
  • వాషింగ్‌ మెషిన్‌లో జీన్స్‌ వేస్తుంటే డెలికేట్‌ సెట్టింగ్స్‌ ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల వేగం, వాషింగ్‌ సైకిల్‌ తక్కువగా ఉంటుంది. జీన్స్‌ ఉతికేందుకు మెషిన్‌లో హాట్‌ వాటర్‌ సెట్టింగ్‌ వాడొద్దు. కోల్డ్‌ వాటర్‌ సెట్టింగ్‌ మాత్రమే వాడాలి.
  • జీన్స్‌ ఫ్యాబ్రిక్‌ రంగు వెలవకుండా ఎక్కువకాలం ఉండాలంటే ఇంట్లో వాడే వైట్‌ వెనిగర్‌ ఒక కప్పు, పావు కప్పు ఉప్పులను చల్లటి నీళ్లలో కలపాలి. ఈ నీళ్లలో ఉతికితే జీన్స్‌ రంగు పోదు. వాషింగ్‌ మెషిన్‌లో వేస్తే కనుక ఎన్ని ట్రిప్‌లు జీన్స్‌ వేస్తే అన్నిసార్లు నీళ్లలో ఆ రెండింటిని కలపాలి. వీటివల్ల జీన్స్‌ వాసన వస్తుంది. కాని ఆరాక ఆ వాసన జీన్స్‌ని వదిలిపోతుంది.

0 comments: