సెల్‌ఫోన్‌లోనే ‘అన్‌రిజర్వ్‌డ్‌’ టికెట్‌

Judagiri |Updated |11-2016

యాప్‌ రూపొందించిన రైల్వేశాఖ 


  • ప్రారంభించిన మంత్రి సురేశ్‌ప్రభు 
  •  క్షణంలో ఖాళీ సీట్ల కేటాయింపు 
  •  ప్రత్యేక యంత్రాల రూపకల్పన 
న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఇకనుంచి అన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్లు, సీజన్‌ టికెట్లు, ప్లాట్‌ఫామ్‌ టికెట్ల కొనుగోలుకు గంటల తరబడి క్యూలో ఉండాల్సిన అవసరంలేదు. ఎందుకంటే మొబైల్‌లోనే ఈ సేవలన్నీ పొందేలా ‘యూటీఎ్‌సఆన్‌మొబైల్‌’ అనే యాప్‌ను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. దీనిని ఢిల్లీలోని రైల్‌ నిలయంలో కేంద్రమంత్రి సురేశ్‌ ప్రభు రిమోట్‌ వీడియో లింక్‌ ద్వారా బుధవారం ప్రారంభించారు. దీంతో అన్‌రిజర్వ్‌డ్‌ ప్రయాణ టికెట్ల సదుపాయం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌-హైదరాబాద్‌ సబర్బన్‌(ఎంఎంటీఎ్‌స)లో అందుబాటులోకి వచ్చింది. అలాగే సికింద్రాబాద్‌ జంక్షన్‌, హైదరాబాద్‌ డెక్కన్‌, బేగంపేట, ఫలక్‌నుమా, లింగంపల్లి రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్‌ టికెట్ల కొనుగోలు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. నెలవారీ, 3నెలలు, 6నెలలు, ఏడాది సీజన్‌ టికెట్లను కూడా దీనిలో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు వీహెచ్‌, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ రవీంద్ర గుప్తా పాల్గొన్నారు. వినూత్న పద్ధతుల్లో భాగంగా ఈ కాగిత రహిత మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారని రవీంద్రగుప్తా తెలిపారు. 5 కిలోమీటర్లకు మించిన దూరానికి టికెట్‌ తీసుకోవచ్చన్నారు.
దుప్పట్లు, దిండ్లు కొనుక్కుని తీసుకెళ్లొచ్చు!
రైళ్లలో కొత్త బెడ్‌షీట్లు, దిండ్లను చౌకధరకే కొనుగోలు చేసే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. రెండు బెడ్‌షీట్లు, ఒక దిండు రూ.140, ఒక దుప్పటి రూ.110, ఒకదుప్పటి, దిండు, బెడ్‌షీట్‌ కలిపి రూ.250 చొప్పున ఐఆర్‌సీటీసీ విక్రయించనుంది. ఆన్‌లైన్‌లోనేగాక, ఎంపిక చేసిన స్టేషన్లలోనూ కొనుగోలు చేయొచ్చు. వీటిని తమతోపాటే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.
టీటీఈల చేతిలో టెర్మినళ్లు
ఇక నుంచి రిజర్వేషన్‌ బోగీల్లో సీట్లు ఖాళీగా ఉంటే... ఎంచక్కా రైలెక్కేసి ఆ తర్వాత టిక్కెట్‌ కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు అరచేతిలో ఇమిడిపోయే మెషీన్లను టీటీఈలకు అందజేయనున్నారు. ఈ టెర్మినళ్లను సురేశ్‌ ప్రభు ప్రారంభించారు. వీటి ద్వారా టీటీఈలు ఖాళీగా ఉన్న సీట్లను ప్రయాణీకులకు అప్పటికప్పుడే కేటాయించవచ్చు. ఇది ఉత్తర మధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే శతాబ్ది రైళ్లలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. రైళ్లలో ఆక్యుపెన్సీ రేషియోను పెంచేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు ఈ మెషిన్లు ఉపయోగపడతాయని సురేశ్‌ ప్రభు వివరించారు.

0 comments: