విజయంతో వీడ్కోలు

  Judagiri | Updated: February 09, 2016 ..
విజయంతో వీడ్కోలు
 వన్డే కెరీర్‌ను ముగించిన మెకల్లమ్ఆసీస్‌తో చివరి మ్యాచ్‌లో కివీస్ గెలుపు  2-1తో సిరీస్ కైవసం

హామిల్టన్: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్‌కు వన్డేల్లో ఘనమైన వీడ్కోలు లభించింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 55 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను కివీస్ 2-1తో దక్కించుకుంది. ఎనిమిదేళ్ల అనంతరం ఆసీస్‌పై కివీస్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. మరోవైపు ఈ మ్యాచ్ మెకల్లమ్‌కు ఆఖరి అంతర్జాతీయ వన్డే కావడం విశేషం. 12 నుంచి వెల్లింగ్టన్‌లో జరగబోయే రెండు టెస్టుల అనంతరం తను అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకోనున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎప్పటిలాగే తన సహజశైలిలోనే చెలరేగిన మెకల్లమ్ 27 బంతుల్లోనే 47 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు; 3 సిక్సర్లున్నాయి. అలాగే వన్డేల్లో 200 సిక్సర్లు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. తొలిస్థానంలో ఆఫ్రిది (351) ఉన్నాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. గప్టిల్ (61 బంతుల్లో 59; 4 ఫోర్లు; 3 సిక్సర్లు), ఎలియట్ (62 బంతుల్లో 50; 1 ఫోర్; 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. మిషెల్ మార్ష్‌కు మూడు.. హాజెల్‌వుడ్, హేస్టింగ్స్, బోలండ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో ఆసీస్ 43.4 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. ఖవాజా (36 బంతుల్లో 44; 4 ఫోర్లు; 2 సిక్సర్లు), మార్ష్ (42 బంతుల్లో 41; 4 ఫోర్లు; 1 సిక్స్) మాత్రమే ఆడగలిగారు. హెన్రీకి మూడు.. అండర్సన్, సోధి రెండేసి వికెట్లు తీశారు.

మెకల్లమ్ వన్డే కెరీర్
మ్యాచ్‌లు            : 260     పరుగులు       : 6,083
అర్ధసెంచరీలు      : 32        సెంచరీలు      : 5
క్యాచ్‌లు            : 262      సగటు            : 30.41

0 comments: