రిటైర్మెంటు వూహాగానాలతో టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విసిగిపోతున్నాడు. వెళ్లిన ప్రతిచోటా రిటైర్మెంట్‌పై ప్రశ్నలడగడం అతడికి పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో తనకు రిటైరయ్యే ఉద్దేశం లేదని.. ఎక్కడ అడిగినా, ఎన్నిసార్లు అడిగినా తన సమాధానంలో మార్పు ఉండదని మరోసారి స్పష్టం చేశాడు. ఇంకా తగినంత సమయం తాను క్రికెట్ ఆడతానని చెప్పాడు.
ప్రతి వేదికపైనా రిటైర్మెంట్‌పై తనను ప్రశ్నించడంపై ధోని అసహనం వ్యక్తం చేశాడు. ఇంకొంత కాలం క్రికెట్లో కొనసాగాలన్న తన ప్రణాళికలో మార్పుండదని ధోని అన్నాడు. ‘‘నేను నెల కింద లేదా 15 రోజుల కింద ఒక విషయం చెప్పానంటే.. ఇప్పుడు అందులో మార్పు ఉండదు. ఎక్కడ అడిగినా సమాధానం అదే. నీ పేరు ఏంటి అని అడిగితే.. ధోని అని ఎలాగైతే చెబుతానో ఇది కూడా అలాగే. ఇంకొంత కాలం అదే సమాధానం ఉంటుంది. నేను ఇప్పట్లో రిటైరవ్వను’’ అని ఆదివారం ఆసియాకప్ కోసం భారత జట్టు బయల్దేరుతున్న సందర్భంగా ధోని విలేకర్లతో అన్నాడు. ‘‘మీకు స్వేచ్ఛ ఉంది కదా అని అన్నీ అడగడం సరికాదు. ఏం చేయాలి, ఎందుకు చేయాలని విశ్లేషించుకోవడం ముఖ్యం. ప్రశ్నించేందుకు వేదిక దొరికిందంటే దానర్థం అడిగిన ప్రశ్నే మళ్లీ మళ్లీ అడగొచ్చని కాదు’’ అని ధోని చెప్పాడు. ‘‘ఏం జరిగినా భారత్‌లో ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకవేళ మేం అలవోకగా ప్రపంచకప్ గెలిస్తే.. మా జట్టు మరీ తొందరగా అత్యుత్తమ ఫామ్‌ను అందుకుందా అని అడుగుతారు. ఫైనల్లో ఓడితే ఒత్తిడిని తట్టుకోలేకపోయారా అని ప్రశ్నిస్తారు. ఫైనల్ చేరలేకపోతే ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కొరవడిందాఅని అడుగుతారు. నేనైతే ప్రశ్నలు అడగకుండా జనాన్ని ఆపలేను. మంచి ప్రశ్నలు అడిగితే మాత్రం నూరు శాతం సమాధానమిస్తా’’ అని అన్నాడు. ఆసియాకప్‌లో అందరికీ అవకాశం: టీమ్‌ఇండియా సన్నాహంపై ధోని సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘మంచి విషయమేంటంటే మేం ఆస్ట్రేలియాలో మూడు మ్యాచ్‌లు ఆడాం. అక్కడ పరిస్థితులు వేరనుకోండి. ఆ తర్వాత శ్రీలంకతో ఆడాం. దీంతో ఈ ఫార్మాట్లో నిలదొక్కుకునే సమయం మా జట్టుకు దక్కింది’’ అని ధోని అన్నాడు. జట్టు సరైన కూర్పును ఎంచుకోవడం కోసం ఆసియాకప్‌లో ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నామని ధోని చెప్పాడు. ‘‘ఆసియాకప్ గెలవడానికి అవసరమైన అన్ని లక్షణాలు మా జట్టులో ఉన్నాయి. అందరికీ ఆడే అవకాశం లభిస్తే అది మాకెంతో మంచిది. ఇక కెప్టెన్‌గా నా అభిప్రాయాల్లో, వ్యూహాల్లో ఏ మార్పూ ఉండదు. నేను అలాగే ఉన్నా’’ చెప్పాడు ధోని.
ఆ ఉద్దేశం లేదు
బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇంకా పైకి వెళ్లాలని అనుకుంటున్నారా అని అడిగినప్పుడు.. ‘‘సాధారణ పరిస్థితుల్లోనైతే నాకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు వెళ్లే ఉద్దేశం లేదు. మా బ్యాటింగ్ ఆర్డర్ అలా ఉంది. భారీ భాగస్వామ్యం నమోదై, 18 లేదా 19వ ఓవర్ వరకు అందరూ బాగా ఆడితే అప్పుడు నేను ముందు రావొచ్చు. లేదంటే నేను ముందు రాను’’ అని ధోని చెప్పాడు.
అతడు గొప్ప క్రికెటర్
టెస్టుల్లో వేగవంతమైన సెంచరీ బాదేసిన న్యూజిలాండ్ ఆటగాడు, ఒకప్పటి చెన్నై సూపర్‌కింగ్స్ సహచరుడు బ్రెండన్ మెక్‌కలమ్‌పై ధోని ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘అతడి ఇన్నింగ్స్ నేను చూడలేదు. ఐతే ఇంతకుముందు అనేకసార్లు అతడి ఆట చూశా. మెక్‌కలమ్ అద్భుతమైన క్రికెటర్. ఎన్నో టెస్టులు, వన్డేలు ఆడాడు. తొలి బంతి నుంచే అలరిస్తాడు. అతడితో డ్రెస్సింగ్‌రూమ్ పంచుకోవడం నా అదృష్టం’’ అని అన్నాడు.
0 comments:
Post a Comment